నమస్తే శేరిలింగంపల్లి: కరోనా విస్తరిస్తున్న వేళ గతేడాది లాక్‌డౌన్‌లో నిత్యావసరలు అందజేసి వేలాది మంది నిరుపేదల ఆకలి తీర్చి మానవాత్వాన్ని చాటిన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి మరోసారి తన ఔదార్యాన్ని చాటేందుకు ముందుకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా బారిన పడి ఆకలి బాదతో పస్తులుండే నిరుపేదలకు, స్వయంగా వంట చేసుకోలేని వారి కోసం గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ భోజనం పంపిణీ చేయనుంది. చందానగర్ డివిజన్ పరిధిలో కరోనా పాజిటీవ్‌కు గురై, భోజనానికి ఇబ్బంది పడే వారికి 14 రోజుల పాటు భోజనం సౌకర్యం ఉచితంగా కల్పిస్తున్నట్టు ట్రస్టు చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది కరోనా కష్టకాలంలో వేలాది మందికి నిత్యావసర వస్తువులు, మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పుడు భోజన వసతి కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆపత్కాలంలో అభాగ్యుల ఆకలి తీర్చడం కన్న మిక్కిలి సేవ ఉండదని, ఉన్నదాంట్లో ఇతరులకు తోచిన సహకారం అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని కరోనా బాదితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భోజనం కోసం ఫోన్ నెంబర్ 8341105888లో ట్రస్ట్ సభ్యురాలు భవానీ చౌదరిని సంప్రదించాలని సూచించారు.






