నమస్తే శేరిలింగంపల్లి: నాటక రంగంలో విశేష ప్రాచుర్యం పొందిన సురభి నాటక కళను భవిష్యత్ తరాలకు అందించాలనే తపనతో శేరిలింగంపల్లి సురభి కాలనీకి చెందిన సురభి కుటుంబ సభ్యులు డాక్టర్ రమేష్ సింధె, ఎం.సంతోష్‌ల బృదం కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే ఆధునిక నటన పద్ధతుల్లో గత నాలుగు నెలలుగా వీకెండ్ థియేటర్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. సురభి కళాక్షేత్రం ద్వారా కొనసాగుతున్న ఈ వర్క్ షాప్‌లో స్థానిక యువతకు నటనలో శిక్షణ ఇస్తున్నారు. కాగా ప్రాధమిక శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులచే బుదవారం సాయంత్రం సురభి కాలనీలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి రాసిన గోగ్రహణం వీధి నాటకాన్ని వీకెండ్ థియేటర్ వర్క్‌షాప్ విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నాటకానికి సురభి సింధె రమేష్ దర్శకత్వం వహించగా, సంతోష్ సహ దర్శకుడిగా, సురభి శ్రీనాధ్ సంగీతం, సురభి ఉమాశంకర్ బృందం లైటింగ్, సురభి ఫణిభూషన్ మేకప్ ఆండ్ కాస్ట్యూమ్స్ సహకారం అందించారు.
పౌరాణికాలతో పాటు ఆధునిక నట శిక్షణే లక్షంగా…
వర్క్ షాప్ నిర్వాహకుడు సురభి సింధె రమేష్ మాట్లాడుతూ సురభి అనగానే పౌరాణిక నాటకాలే గుర్తుకు వస్తుంటాయని, ఐతే మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకుని సురభి యువతరానికి ఆధునిక నాటక ప్రక్రియల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. జనవరి నుంచి కోనసాగుతున్న వీకెండ్ వర్క్ షాప్‌లో సురభి యువత ఉత్సాహంగా పాల్గొని అనేక మెళకువలు నేర్చుకున్నారని అన్నారు. కరోనా ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి ప్రదర్శనను నిరాడంబరంగా చేపట్టడం జరిగిందని, ప్రతి విద్యార్థి తమ ప్రతిభతో నాటక ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారని అన్నారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగుతామని, తమ ప్రయత్నానికి అండగా నిలుస్తున్నశ్రీ ఆవేటి మనోహర్ సురభి కళామందిరం వారికి, సురభి యువసేన వారికి, సురభి కాలనీ కుటుంబ సభ్యులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నటనలో శిక్షణ పొందాలనుకునే ఔత్సాహికులు ఫోన్ నెంబర్ 9490423885లో సంప్రదించాలని సూచించారు.