శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పై కక్ష్యసాధింపు చర్యలకు కాంగ్రెస్ సర్కార్ దిగిందని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుట్ర పూరితంగా కేసీఆర్ ను బద్నాం చేయాలని, అందులో భాగంగానే కాళేశ్వరం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. అభివృద్ధి చేయలేక, ప్రాజెక్ట్ లు కట్టలేక కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరంపై కమిషన్ రిపోర్ట్ అని చేస్తున్న కుట్రలను సాగనీయమన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం అహర్నిశలు పని చేసిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్న కాలం నుంచి దేశంలో అత్యధికంగా వరి దిగుబడి వచ్చేస్థాయికి తీసుకువెళ్లినందుకా కేసీఆర్ ను బద్నాం చేసేదని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి, అన్నదాతకు అండగా నిలిచారని గుర్తు చేశారు. రైతన్నల సంక్షేమమే ధ్వేయంగా పని చేసిన ఘనత నాటి భారాస సర్కార్ దని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ సరిగా చేయలేదని, రైతు బంధు ఎగ్గొట్టారని, అవన్నీ ప్రజలు నిలదీస్తారని తెలిసి, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుందని రవీందర్ యాదవ్ వెల్లడించారు. కేసీఆర్ పై చేస్తున్న కుట్రలు మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలే గద్దె దించుతారని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో బంపర్ మెజార్టీలతో భారాస విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






