అంజయ్యనగర్‌లో 1.20 ఎకరాల పార్కు కబ్జా ఫిర్యాదు.. అధికారులపై సిఎంసి కమిషనర్ సీరియస్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంజయ్యనగర్ సర్వే నంబర్లు 134, 136లోని సుమారు 1 ఎకరా 20 గుంటల పార్కు స్థలం కబ్జాకు గురవుతోందని, పార్కును పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి. సృజనకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు అంజయ్యనగర్, సిద్ధిఖ్ నగర్ ప్రాంతాల స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని పార్కు స్థలాన్ని కాపాడాలని అధికారులను కోరారు.

ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్ సృజన.. పార్కుల కబ్జాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఫిర్యాదుపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే రోజు పార్కుల కబ్జాలకు సంబంధించి ఇది రెండో ఫిర్యాదు అని కమిషనర్ పేర్కొన్నట్లు చెప్పారు. అంజయ్యనగర్‌లోని పార్కు స్థలాన్ని కాపాడటంతో పాటు, కబ్జాకు సంబంధించిన అంశంపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here