నీటి ఎద్దడిని నివారించేందుకు ఇప్పటి నుంచే పొదుపు చేయాలి: కట్ల శేఖర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు చందానగర్‌లోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. నీటిని అవసరమైన మేరకే వినియోగించాలని, ప్రతి నీటి బొట్టును విలువైనదిగా భావించాలని సూచించారు. నిత్యావసరాలకు ఉపయోగించే నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.

ఇళ్లలో నీటి లీకేజీలను వెంటనే అరికట్టాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కట్ల శేఖర్ రెడ్డి సూచించారు. నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను కొంతవరకు నివారించవచ్చని పేర్కొన్నారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ నీటి ప్రాముఖ్యతను గుర్తించి, నేటి నుంచే పొదుపు చర్యలు చేపట్టాలని, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందించే బాధ్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here