ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు చేపట్టాలి: సైబరాబాద్ సీపీ

శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ జంక్షన్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అధికారులను ఆదేశించారు. ఖాజాగూడ జంక్షన్‌ను మంగళవారం సందర్శించిన సీపీ.. అక్కడ జరుగుతున్న రోడ్డు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణం, అండర్‌పాస్ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పైప్‌లైన్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల మార్పులు సహా ఇతర సాంకేతిక అంశాలపై చర్చించారు.

అలాగే, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలంగా గుర్తించిన మణికొండలోని జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌ను ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని, ప్రజల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను కొనసాగించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్ డీసీపీ రవికుమార్, మాదాపూర్ ట్రాఫిక్ అదనపు డీసీపీ హనుమంత్ రావు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, లా అండ్ ఆర్డర్ ఏసీపీ శ్రీధర్, రాయదుర్గం ఎస్‌హెచ్‌ఓ భూపతి, ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ పవన్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here