గోపినగర్‌లో రూ.2.5 కోట్లతో G+1 ఫంక్షన్ హాల్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునే సౌకర్యం కల్పించేందుకు గోపినగర్‌లో రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న G+1 మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ స్థలాన్ని శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ సహకారంతో ఈ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్, నెహ్రూ నగర్, బాపూనగర్, ప్రశాంతి నగర్, పరిసర బస్తీలలో నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇంట్లో జరిగే శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లకు అధిక అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించి, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు. సుమారు రూ.2.5 కోట్లతో నిర్మించనున్న ఈ G+1 ఫంక్షన్ హాల్‌లో ఒకేసారి 500 మంది కూర్చునే సదుపాయంతో పాటు వంటగది, మరుగుదొడ్లు, ఇతర ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ భవనాన్ని శుభకార్యాలకే కాకుండా ప్రభుత్వ సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణకు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల స్థానిక ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఇంజనీరింగ్ విభాగం డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, శ్రీకాంత్ దేవులపల్లి, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, మహేష్ చారీ, సాయన్న, ప్రభాకర్ యాదవ్, మహేందర్ సింగ్, విజయ్, రేణు, మహేష్, సంతోష్‌తో పాటు మహిళలు ముంతాజ్ బేగం, చందాదేవి, సుధారాణి, కమలమ్మ, నర్సమ్మ, హైమవతి, భాగ్యమ్మ, స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here