చందానగర్‌లో కమిషనర్ సృజ‌న క్షేత్రస్థాయి తనిఖీ

శేరిలింగంప‌ల్లి, మే 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రతిరోజు ఒక వార్డు (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజ‌న శేరిలింగంపల్లి జోన్ ప‌రిధిలోని మియాపూర్ సర్కిల్ చందానగర్ వార్డులో క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. చందానగర్‌లోని పీజేఆర్ (PJR) స్టేడియంలో జరిగిన ఈ పర్యటనలో శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ, జోనల్ కమిషనర్, డెప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక నివాసితులు, పౌరులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్, పారిశుధ్యం, పార్కులు, క్రీడా మౌలిక సదుపాయాలు, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలను సమీక్షించారు.

స్థానిక నివాసితులు వివిధ విభాగాలకు సంబంధించిన పలు సమస్యలను, మౌలిక సదుపాయాల అవసరాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. పీజేఆర్ స్టేడియంలో ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ కాలువను పునర్నిర్మించాలని కోరారు. పీజేఆర్ స్టేడియంలోని బాడ్మింటన్ కోర్టు పైకప్పు (Roof) లీకేజీ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. పీజేఆర్ స్టేడియం ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలలో నీటి నిల్వ, డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదు చేశారు. హుడా కాలనీ ఫేజ్-II లోని ఖాళీ స్థలాల ఆక్రమణలను తొలగించాలని, జాతీయ రహదారి-65 (NH-65) నుండి పీజేఆర్ స్టేడియం లేన్ పొడవునా ఉన్న ఆక్రమణలను తొలగించాలని విన్నవించారు. బతుకమ్మ కుంట బహిరంగ భూమిని సంరక్షించాలని, అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీల్లోని పార్కులను ఆధునీకరించి, అభివృద్ధి చేయాలని కోరారు. పబ్లిక్ పార్కులలో మెరుగైన నిర్వహణతోపాటు అదనపు వసతులు కల్పించాలని సూచించారు.

ఇంటింటికీ చెత్త సేకరణ కోసం వచ్చే సాట్ (SAT) వాహనాలు క్రమబద్ధంగా రావడం లేదని ఫిర్యాదు చేశారు. కాలనీలలో క్రమం తప్పకుండా రోడ్లను ఊడ్చాలని, పారిశుధ్య సేవలను మెరుగుపరచాలని కోరారు. పలు ప్రాంతాలలో దోమల నివారణకు ముమ్మరంగా ఫాగింగ్, నివారణ మందుల పిచికారీ చేపట్టాలని విన్నవించారు. పీజేఆర్ స్టేడియంలోని ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వేళలను క్రీడాకారులకు అనుకూలంగా మార్చాలని కోరారు. అథ్లెటిక్స్ ప్రాక్టీస్ కోసం ఇసుక గుంతలు (Sand Pits), మరిన్ని టేబుల్ టెన్నిస్ టేబుళ్లతో కూడిన అదనపు క్రీడా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. అందుబాటులో ఉన్న క్రీడా ప్రాంగణాలను మెరుగ్గా ఉపయోగించుకుంటూ, వాటిని సరిగ్గా నిర్వహించాలని సూచించారు. రెడ్ మార్క్ (Red Mark) ఎంట్రీల కారణంగా ఎదురవుతున్న భూమి రిజిస్ట్రేషన్, ప్లాట్ల విక్రయాల సమస్యలను ప్రస్తావించారు. కొన్ని లేఅవుట్లలో భవన నిర్మాణ అనుమతులు, బఫర్ జోన్ (Buffer Zone) క్లియరెన్స్ సమస్యలను వివరించారు.

కమిషనర్ డెప్యూటీ కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులను ఆదేశిస్తూ.. పౌరులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, అన్ని విభాగాల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పారిశుధ్యం, వ్యర్థాల సేకరణ వ్యవస్థను మెరుగుపరచడం, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం, పెండింగ్‌లో ఉన్న పౌర ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడం, అదే వార్డులో తదుపరి పర్యటన జరిగేలోపు క్షేత్రస్థాయిలో మార్పు స్పష్టంగా కనిపించేలా చూడడం, ప్రతిరోజు ఒక వార్డు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం పౌరుల నుండి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో సమన్వయ చర్యల ద్వారా వాటిని వేగంగా పరిష్కరించడమేనని కమిషనర్ పునరుద్ఘాటించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here