నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చెరువుల సుందరీకరణకు సహకరించాలని, ప్రభుత్వ నిధులు గాని సీఎస్ఆర్ నిధులు గాని మంజూరు చేసి సహకరించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ను కోరారు. శుక్రవారం శేరిలింగంపల్లి మండల పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ను శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రవికిరణ్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని చెరువులు కబ్జాలకు గురి కాకుండా సంరక్షించాలని, చెరువులు అన్యాక్రాంతం కాకుండా ఎఫ్ టీ ఎల్ బఫర్ జోన్ లు నిర్దేశిస్తూ చెరువులను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ ఆమోయ్ కుమార్ ఆందుకు సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో 7 ఎస్టీపీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీపీల నిర్మాణానికి స్థలాల కేటాయింపు జరిగేలా చూడాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కోరగా అందుకు సానుకూలంగా స్పందించారు.