నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో వారి కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనులతో పాటు పలు సమస్యలపై వారితో ప్రత్యేకంగా చర్చించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడలని, కబ్జా కోరుల నుండి పరిరక్షించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ), మైనింగ్ నిధుల నుంచి మంజూరి చేసిన పనుల పురోగతిని సమీక్షించి, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సంబంధిత అధికారులను ఆదేశించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అదేవిధంగా వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలను నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని, గృహ నిర్మాణ పధకంలో డబ్బులు చెల్లించి ఉన్న అర్హులైన లబ్దిదారులకు త్వరిత గతిన ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపడుతున్నసంక్షేమ పథకాలు ప్రజలకు చేరువాయేలా చూడాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వాటి అమలు, నిర్వహణ తీరు తెన్నులపై చర్చించడం జరిగిందని, వాటన్నిటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.