ఢిల్లీ (నమస్తే శేరిలింగంపల్లి): సీఎం కేసీఆర్ రజాకార్లకు అమ్ముడుపోయిన కుక్క అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హాలియాలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సభలో నిరసన తెలిపేందుకు యత్నించిన పలువురు బీజేపీ మహిళా కార్యకర్తలను ఆయన కుక్కలు అని దూషించారు. ఈ క్రమంలోనే ఎంపీ అరవింద్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ మహిళలను కుక్కలని అనడం దారుణమన్నారు. బాధలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన మహిళలను సీఎం కేసీఆర్ కుక్కలని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఓవైసీకి అమ్ముడుపోయిన కుక్క అని అన్నారు. సీఎం కేసీఆర్ హాలియా బహిరంగ సభలో చెప్పినవన్నీ అబద్ధాలేనని, అసలు ఆయనే ఒక అబద్ధాల పుట్ట అని, అవినీతి గుట్ట అని అన్నారు. సీఎం కేసీఆర్ ఓ మూర్ఖుడని, సంస్కార హీనుడని అన్నారు. గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన మహిళలను కుక్కలు అన్న నువ్వు మదమెక్కిన పెద్ద కుక్కవా ? అని అరవింద్ ప్రశ్నించారు. గిరిజన మహిళలను కుక్కలని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ అహంకార పూరిత వైఖరిని ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని, ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.