హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తలలో క్రికెట్ బాల్ సైజులో ఉన్న కణితితో బాధపడుతున్న రోగికి మెడికవర్ వైద్యులు అత్యంత కీలకమైన చికిత్స చేసి ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించారు. హాస్పిటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు హాస్పిటల్ వైద్యులు వివరాలను వెల్లడించారు.

విజయలక్ష్మి అనే 55 ఏళ్ల మహిళకు ఇటీవల నడవడంలో తీవ్ర సమస్య ఎదురైంది. దీంతోపాటు చూపు మందగించింది. అలాగే ఆహారం తీసుకోవడంలోనూ తీవ్ర సమస్యలను ఎదురయ్యాయి. దీంతో ఆమె హాస్పిటల్‌కు వచ్చింది. అయితే ఆహారం ఎప్పుడు తీసుకోవాలనుకున్నా ఆమెకు దగ్గు రావడం, ముద్ద మింగడమే కష్టమవడం, ఆమె గొంతు కూడా మారిపోవడాన్ని వైద్యులు గమనించారు. ఈ క్రమంలో ఎంఆర్‌ఐ చేసిన తరువాత ఆమె పుర్రెలో క్లైవల్ కార్డోమా లెసియన్ ఉన్నట్లుగా తేలింది. ఇది దిగువ కపాలనాడుల వరకూ విస్తరించింది. ఈ కారణం చేతనే ఆమె స్వర పేటిక నరాలకు పక్షవాతం రావడంతో పాటు మింగడమూ ఇబ్బందిగా పరిణమించింది.
ఈ క్రమంలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డితో కూడిన వైద్యుల బృందం ట్రాన్స్-నాసల్ (ముక్కు ద్వారా) ఎండోస్కోపిక్ విధానంను అనుసరించి చికిత్స చేయాలని నిర్ణయించారు. కరోటిడ్ ఆర్టరీస్ (మెడద్వారా వెళ్లే నరాలు) కూడా దీనిలో భాగం కావడం వల్ల డాక్టర్లు నేవిగేషన్ వ్యవస్థతో పాటుగా ఎండోస్కోపిక్ విధానాన్ని సైతం అనుసరించి కణితి తొలగించారు. ఈ కణితికి సంబంధించిన కొంత భాగంగా ఐసీఏకు అతుక్కుని ఉండిపోయినప్పటికీ తరువాత మొత్తం కణితిని తొలగించారు. తొలి రోజే రోగి వేగంగా కోలుకోవడంతో నాజల్ ప్యాక్స్‌ను తొలగించారు. ఆమె గొంతు కూడా మెరుగుపడటంతోపాటు మాట కూడా సరిగా రావడం ఆరంభమైంది. ఆమె తనంతట తానుగా తినడంతోపాటు గతంతో పోలిస్తే చక్కగా నడువగలుగుతోంది.
ఈ శస్త్రచికిత్సను తగిన సమయానికి చేయడం వల్ల ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తప్పించగలిగారు. దిగువ భాగంలోని కపాల నాడులకు దగ్గరగా కణితి ఉండటం వల్ల ఆమె తినాలనుకున్నా తినలేదు. ఆమె తీసుకున్న ఆహారం కూడా నేరుగా ఊపిరితిత్తులకు చేరే ప్రమాదమూ ఉంది. అది ప్రాణాపాయానికి దారి తీసేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో కణితి క్లిష్టతను అనుసరించి బహు ముఖ విధానాలను అనుసరించి ఎండోస్కోపిక్ ట్రాన్స్ నాజల్ పద్ధతిలో డాక్టర్లు చికిత్స చేయగలిగారు. కణితి దగ్గరకు చేరేందుకు ఈఎన్‌టీ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ అత్యంత సవాల్‌తో కూడినదైనప్పటికీ అత్యున్నత నైపుణ్యం, సాంకేతికతతో రోగి ప్రాణాలను మెడికవర్ వైద్యులు కాపాడారు.