హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): విద్యుత్ రంగానికి చెందిన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఛలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి ఆలిండియా ఐఎన్టీయూసీ, యూవీ విద్యుత్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, యూనియన్ సెక్రటరీ జనరల్ ఈ.శ్రీధర్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వరంగల్ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింప చేయాలని, మిగిలిపోయిన కాంట్రాక్టు కార్మికులందరినీ అన్ మాండ్ కార్మికులు, స్పాట్ బిల్డర్స్, బిల్ కలెక్టర్స్, ఎస్పీఎం కార్మికులు, స్టోర్ లో పనిచేస్తున్న హమాలీలను అందరినీ ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని, అన్ని సబ్ స్టేషన్ లలో వాచ్ మెన్ లను నియమించాలని, ఫీల్డ్ లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు టీఏ బిల్లు ఇవ్వాలని, ఆర్టిజన్ కార్మికులను సొంత జిల్లాలకు బదిలీలు చేయాలని, సబ్ స్టేషన్ లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇంకా ఎన్నో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఛలో వరంగల్ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని అన్నారు.
