శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): యంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ 3వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పిబ్రవరి 14 నుండి 21 వరకు జరిగే కార్యక్రమాలను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించి మియాపూర్ టేకు నరసింహ నగర్ లో కరపత్రం విడుదల చేశారు. అనంతరం వనం సుధాకర్ మాట్లాడుతూ… ఎంసిపిఐ(యు)పొలిటి బ్యూరో సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ 2022 ఫిబ్రవరి 14న అమరులైన తాండ్ర కుమార్ 3వ వర్ధంతి కార్యక్రమాన్ని 2025 ఫిబ్రవరి 14 నుండి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా భూమి ఇండ్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ విధానాలు మన కర్తవ్యం అనే అంశంపై సభలు సమావేశాలు జరుపుతున్నామని తెలియజేశారు.
ఫిబ్రవరి 14న మొదటి రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ క్రాస్ రోడ్డు వద్దగల తాండ్ర కుమార్ భారీ స్తూపం నుండి టేకు నరసింహ నగర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం టేకు నరసింహనగర్ లో తాండ్ర కుమార్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం సభ జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి యంసిపిఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్, బిఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, వామపక్ష కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులు, యంసిపిఐ(యు) రాష్ట్ర నాయకత్వం, వివిధ జిల్లాల నుండి పార్టీ శ్రేణులు ప్రజాసంఘాల నాయకులు హాజర వుతున్నారని తెలియజేశారు. భూమి, ఇండ్లు, ఇళ్ల స్థలాలు కోసం, పేద ప్రజల విముక్తి కోసం. పాలకవర్గాల తప్పుడు విధానాలపై తాండ్ర కుమార్ రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి గత టిఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలు భూమి, ఇండ్లు, ఇళ్ల స్థలాలు అంశంపై ప్రజలను మోసగిస్తూ వస్తున్నాయని, తప్పుడు వాగ్దానాలకు తోడుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని, ఈ పాలక దోపిడి ఆకాశ వాద ప్రభుత్వాల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా తాండ్ర కుమార్ మూడవ వర్ధంతి సందర్భంగా ప్రజా చైతన్య కార్యక్రమం చేపడతామని ఆయన తెలియజేశారు. ఈకార్యక్రమంలోయంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, వర్గ సభ్యులు తాండ్ర కళావతి, కర్ర దానయ్య, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, వి తుకారాం నాయక్, కమిటీ సభ్యులు పి భాగ్యమ్మ, డివిజన్ నాయకులు, శివాని, నర్సింహా, వి అనిత, శంకర్, బి పార్వతి, ఇషాక్, టి ఎన్ నగర్ వాసులు కప్పర రమేష్, చంద్రకళ, సి హెచ్ క్రిష్ణ, శ్రీను, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.