నమస్తే శేరిలింగంపల్లి: సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతిభద్రతలను కాపాడుకోవచ్చని, నేరాలను నియంత్రించ వచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడాకాలనీ లోని ఉమాస్ సప్పైర్ హైట్స్ అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ఆవశ్యకత పై ఎస్ ఐ లు అహ్మద్ పాషా, రంజిత్ కుమార్ తో కలిసి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు. అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషి గా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా కోటి రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు అపార్ట్ మెంట్ వాసులు ముందుకు రావడం అభినంద నీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చెన్నం రాజు, మంత్రి ప్రగఢ సత్యనారాయణ, రామేశ్వరమ్మ, రామారావు, లక్ష్మణ్ రావు, మహేందర్, లక్ష్మణ్, అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ అనిల్, సెక్రటరీ శ్రీమయి తదితరులు పాల్గొన్నారు.