శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వార్డుల విభజనపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వార్డుల విభజన తప్పుల తడకగా ఉందని పేర్కొంటూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ ని ఆ పార్టీ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్యానికి అనుకూలంగా విచ్చలవిడిగా డివిజన్లను ఏర్పాటు చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు డివిజన్ మ్యాప్ లను కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. డివిజన్ మ్యాప్ లు లేకుండా, చూడకుండా అభ్యంతరాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు. నేషనల్ హైవేలను విడిచి పెట్టి చిన్న చిన్న మురికి కాలువలను హద్దులుగా నిర్ణయించారని, ఒకే కాలనీని రెండు డివిజన్లుగా చీలుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మాత్రమే డివిజన్ మ్యాప్ లను ఇస్తున్నారని, ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇవ్వడం లేదన్నారు. ఒక డివిజన్ ను పెద్దగా, ఒక డివిజన్ ను చిన్నగా తప్పుల తడకగా ఏర్పాటు చేస్తున్నారని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, ప్రజల నుండి పిర్యాదులు స్వీకరిస్తున్నాం అంటున్నారు కానీ ప్రజలకు డివిజన్ మ్యాప్ లను అందించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, వాలా హరీష్, రోజా, శ్రీనివాస్ రావు, రామకృష్ణ గౌడ్, కిరణ్ యాదవ్, అల్లావుద్దీన్, గౌస్, బాలరాజు, సంతోష్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






