శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అమలుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి బాధ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి డివిజన్ నాయకులు పొట్ట నరేందర్ యాదవ్, మారబోయిన రవి యాదవ్, సానే విజయ్ కుమార్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఇంటికీ చేరవేసి ప్రజలతో పూర్తి చేయించి, నిర్ణీత గడువులోపు బూత్ లెవల్ అధికారులకు (BLOలు) తిరిగి అందేలా పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించడంతోపాటు, ఓటరు జాబితాలోని తప్పులను గుర్తించి సరిచేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. డివిజన్ అధ్యక్ష స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన మాధవరం కృష్ణారావు రాజకీయ ప్రయాణం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని, SIR ప్రక్రియను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి గరిష్ట స్థాయిలో ఓటరు నమోదు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.
ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణలో సహకరించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.





