కుమార్తెను వేధిస్తున్నాడనే కక్షతో హోటల్ కార్మికుడి హత్య

శేరిలింగంప‌ల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లో ఓ హోటల్ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుమార్తెను వేధిస్తున్నాడనే కక్షతో ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 14వ తేదీ రాత్రి 11:47 గంటల సమయంలో ధృవ కాలేజ్ సమీపంలోని ఇమేజ్ గార్డెన్ రోడ్ ఎదురుగా ఉన్న శ్రీ శ్రీ సూట్స్ (నోమా) హోటల్ వద్ద గొడవ జరుగుతున్నట్లు డయల్-100 ద్వారా మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ హోటల్‌లో పనిచేస్తున్న సెనేపల్లి భాస్కర్ (32) తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించారు.

ప్రాథమిక విచారణలో భాస్కర్ గత కొంతకాలంగా ప్రధాన నిందితుడు రాజు కుమార్తెను వేధిస్తున్నాడని, దీంతో కక్ష పెంచుకున్న రాజు తన బావ కుమారస్వామితో కలిసి కర్రలతో భాస్కర్‌పై దాడి చేసి అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన రాజు, కుమారస్వామి ఇద్దరూ వరంగల్ జిల్లా హనుమకొండ ప్రాంతానికి చెందినవారని, ప్రత్యేకంగా జూలై 14న హైదరాబాద్‌కు వచ్చి మాదాపూర్‌లో ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌ను చికిత్స కోసం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బుధ‌వారం తెల్లవారుజామున 1:05 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here