కాగితపు పడవలతో వినూత్న నిరసన – మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ ప్రధాన సర్కిల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు గుంతలమయమై వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని చందానగర్ మాజీ కార్పొరేటర్, బిజెపి నాయకురాలు బొబ్బ నవత రెడ్డి ఎద్దేవా చేశారు. చందానగర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు గుంతలమయమై నీటితో నిండిపోవడంతో కాగితపు పడవలు వేసి బిజెపి నాయకులతో కలిసి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చందానగర్ డివిజన్ నడిబోడ్డున గాంధీ విగ్రహం ఎదురుగా నేషనల్ హైవే కి అనుకోని ఉన్న సర్వీస్ రోడ్డు గుంతలమయమై అధ్వాన్నంగా మారిందన్నారు. రోజుకు వేలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డులో పరిస్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. తాత్కాలికంగా గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా చేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు కాలయాపన చేయటం సరికాదన్నారు. మాన్ సూన్ టీంలు అస్సలు ఉన్నాయో లేవో తెలియడం లేదని, ఉన్నా ఎక్కడ పనిచేస్తున్నాయో తెలియట్లేదని అన్నారు. దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రవాణా మార్గం సులభం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి చందానగర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు నర్సింహ రావు పంతులు, పోచయ్య, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

గుంతలమయమైన రోడ్డులో కాగితపు పడవలతో నిరసన తెలుపుతున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here