నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలపై బిజెపి చేపట్టిన నిరుద్యోగ దీక్షకు శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు మద్దతు పలికారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన మాటను విస్మరించారని చెప్పారు. రాష్ట్రంలో ఇంటి నిండా ఉద్యోగాలు పొందింది ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు రెట్లు నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఏడేళ్ల ప్రభుత్వ హయాంలో ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని అన్నారు. ట్విట్టర్ ద్వారా మాత్రమే స్పందించే కేటీఆర్ కు నిరుద్యోగుల ఆత్మహత్యలు, వారి తల్లిదండ్రుల కడుపుకోతలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ట్విట్టర్ పిట్టల దొర కేటీఆర్ కు, సీఎం కేసీఆర్ కు ప్రజలు, నిరుద్యోగులు సరైన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ దీక్షలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ శ్రీమతి విజయశాంతి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మంత్రి శ్రీనివాస్, పలువురు సీనియర్ నాయకుల తో పాటు శేరిలింగంపల్లి బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.