నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అర్హులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై మొండి వైఖరితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో, నిరుద్యోగ భృతి హామీ అమలు లో ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం కేసీఆర్ సర్కార్ పాలనలో యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు కేసీఆర్ ప్రభుత్వ హత్యలేనని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాల ఉసురు టిఆర్ఎస్ కి తప్పకుండా తగులుతుంది అని అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నీరు గార్చిన నియంతృత్వ కేసీఆర్ సర్కారుకు బుద్ది చెప్పేందుకు రాష్ట్రంలో బిజెపి, బిజెవైఎం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.