- కుటుంబ సభ్యులను అభినందించిన అల్లం పాండురంగారావు
నమస్తే శేరిలింగంపల్లి: ఓ వృద్ధుడి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాల్లోకెళితే… భెల్‌లో సీనియర్ మేనేజర్‌గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఏ.లక్ష్మీనారాయణ(80) కుటుంబ సభ్యులతో కలసి భెల్ హెచ్ఐజీలో నివాసం ఉంటున్నాడు. కాగా సోమవారం సాయంత్రం లక్ష్మీనారాయణ సహజ మరణం చెందారు. దీంతో వారి కుటుంబానికి సన్నిహితుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ సమాచారాన్ని భెల్ నేత్రదాన సంచాలకర్త, విజయ హాస్పిటల్ ఎండీ అల్లంపాండురంగారావు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఆయన శ్రీనివాస్‌తో కలసి లక్ష్మీనారాయణ కటుంబ సభ్యులతో మాట్లాడి నెత్రదానానికి అనుమతి తీసుకున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వారితో మాట్లాడి నేత్రాలను(కార్నియ) దానం చేయించారు.

ఈ సందర్భంగా అల్లం పాండురంగారావు మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యుడి నేత్రాలను దానం చేసి ఇతరుల కళ్లలో వెలుగు చూడాలనుకోవడం గొప్ప విషయం అన్నారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని, సకాలంలో సమాచారం అందించిన శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో దుఖఃలో ఉండి కూడి ఇంటి పెద్ద నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారి సతీమణి సుబ్బలక్ష్మీ, కుమారులు సుభాష్, విజయ్‌కుమార్‌లను అల్లం పాండురంగారావు ప్రత్యేకంగా అభినందించారు. నేత్రాలను దానం చేయడం వల్ల మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపవచ్చనే అవగాహన ప్రజల్లో మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.