- ఉత్తమ హోమియోపతి ఆసుపత్రిగా గాయత్రి హాస్పిటల్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రాక్సిస్ మీడియా సంస్థ దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న మహిళను గుర్తిస్తూ నిర్వహించిన ఉమెన్ లీడర్‌షిప్ అవార్డుకు నగరానికి చెందిన ప్రముఖ హోమియోపతి వైద్యురాలు డా.కల్పన ఎంపికయ్యారు. హైదరాబాద్ నగరంలో ఉత్తమ హోమియోపతి ఆసుపత్రిగా డా.కల్పన నిర్వహిస్తున్న గాయత్రి హోమియోపతి ఆసుపత్రిని ప్రాక్సిస్ మీడియా సంస్థ ఎంపిక చేసింది. డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాక్సిస్ సంస్థ ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తూ, వివిధ సంస్థల సేవలపై వివరాలు సేకరిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో లీడర్‌షిప్ అవార్డులను అందజేస్తూ వస్తోంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పది విభాగాల్లో దాదాపు 25 వేల మంది మహిళలు నామినేట్ అవ్వగా వారిని ఐదు దశల్లో పరిశీలించి 16 మంది మహిళలను ఉమెన్ లీడర్‌షిప్ అవార్డుతో సత్కరించనుంది. అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలోని సంస్థ కార్యాలయంలో జరుగాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో కొరియర్ ద్వారా అవార్డులను అందజేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ విషయమై డా.కల్పన స్పందిస్తూ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డుకు ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తాను వైద్యవృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది థైరాయిడ్ రోగులకు హోమియోపతి వైద్యం ద్వారా చికిత్స అందించి నయం చేయగలిగానని తెలిపారు. తన సేవలను గుర్తించి ప్రాక్సిక్ మీడియా సంస్థ అందించిన అవార్డును గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.