చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవానీమాత ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారికి సుప్రభాత హారతి, శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని శ్రీ లలితా పరమేశ్వరి స్వరూపిణిగా అలంకరించారు. అనంతరం మహిళా భక్తులచే శ్రీ లలితాపరమేశ్వరి సహస్ర శత నామ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని చుట్టు పక్కల ప్రజలు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు దర్శించుకుని హారతి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి, భవానీ ఆలయ అర్చకుడు రవిశర్మ, పాలకమండలి సభ్యులు, దేవాలయ సేవాసమితి సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు తదితరులు పాల్గొన్నారు.
