నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సెప్టెంబర్ 27న తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఎంసీపీఐ యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్టాలిన్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత్ బంద్ ఫోస్టర్ ను ఆవిష్కరించారు. ఏఐకెఎస్ సీసీ పిలుపుమేరకు సెప్టెంబర్ 27 న భారత్ బందును జయప్రదం చేయాలని వనం సుధాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను, 2020 విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అందుకోసమే పార్లమెంట్ లో రైతాంగ వ్యతిరేక చట్టాలను ఆమోదించిందని అలాగే విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఈ చట్టాల వలన దేశంలో వ్యవసాయ రంగ పరిస్థితి నిర్వీర్యం అవుతుందని, ఈ చట్టాల కు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 27న భారత్ బంద్ కు ఏఐకెఎస్ సీసీ పిలుపునకు ఎంసీపీఐ యూ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి. తుకారాం నాయక్, కార్యదర్శివర్గ సభ్యులు కుంభం సుకన్య రమేష్, టి. అనిల్ కుమార్, టి. కళావతి, కమిటీ సభ్యులు ఈ భాగ్యమ్మ, పి మురళి తదితరులు పాల్గొన్నారు.