శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలు కీలకంగా ఓట్లు వేసి గెలిపించిన నేపథ్యంలో, వారికి తగిన రాజకీయ ప్రతినిధ్యం కల్పించాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాజకీయ పార్టీలను డిమాండ్ చేసింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 70 మున్సిపల్ చైర్మన్ పదవులు, అలాగే 7 కార్పొరేషన్లలో 4 మేయర్ స్థానాలు బీసీలకు కేటాయించాలని స్పష్టం చేసింది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు ఓట్లు వేసి గెలిపించిన బహుజన ప్రజలకు ముందుగా అభినందనలు తెలిపారు. అనంతరం ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని బీసీలకు 70 మున్సిపల్ చైర్మన్ పదవులు, 4 మేయర్ స్థానాలు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 53 శాతం, బీఆర్ఎస్ పార్టీ 53 శాతం, బీజేపీ పార్టీ 49 శాతం మేర బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినప్పటికీ, రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 31 శాతం అవకాశమే లభించిందని తెలిపారు. అయితే జనరల్ స్థానాల్లో ఆధిపత్య కులాలతో పోటీ పడి బీసీలు 48 శాతం వరకు విజయం సాధించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 80 మున్సిపల్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో, కనీసం 60 చైర్మన్ పదవులు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న 13 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 10 పదవులు బీసీలకు ఇవ్వాలని, అలా చేయకపోతే ఆ పార్టీని బీసీ వ్యతిరేక పార్టీగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్పొరేషన్ల విషయంలోనూ స్పష్టమైన డిమాండ్ చేశారు. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి దక్కిన 5 మేయర్ స్థానాల్లో కనీసం 3 బీసీలకు కేటాయించాలని కోరారు. అలాగే కరీంనగర్ మేయర్ పదవిని బీసీలకు ఇవ్వాలని బీజేపీని కోరుతూ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి బండి సంజయ్ నిజంగా బీసీ పక్షపాతులైతే తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 42 శాతం బీసీ రిజర్వేషన్లు, బీసీ బడ్జెట్, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర అన్యాయం చేసిందని బాలరాజ్ గౌడ్ విమర్శించారు. కేంద్రంలో బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. బీసీ బిల్లు విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీసీల పట్ల చిత్తశుద్ధి చూపించడానికి ఇదే మంచి అవకాశమని వ్యాఖ్యానించారు. ఈ దశలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లేదా కమ్యూనిస్టు పార్టీల అడ్డంకులు ఏవీ లేవని, ఎన్ని మున్సిపల్ చైర్మన్, ఎన్ని మేయర్ పదవులు బీసీలకు ఇస్తారో ఇప్పుడు స్పష్టంగా తేల్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లకు బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేశారు.
అలా కాకుండా కాంపెయిన్ పేరుతో మూడు, నాలుగు స్థానాల్లో గెలిచిన అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలకు ఒకే సామాజిక వర్గానికి పదవులు కట్టబెడితే, రాబోయే ఎన్నికల్లో గ్రామగ్రామాల్లో తమ పార్టీలకు వ్యతిరేకంగా చావు డప్పు కొడతామని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్, కన్వీనర్లు బైరు శేఖర్, అయిలి వెంకన్న గౌడ్, యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు నాగభూషణం, హైదరాబాద్ అధ్యక్షుడు దామోదర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీను, నరేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.





