నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని బచ్చుకుంట చెరువులో లాక్‌డౌన్ వేళ వెలిసిన అక్రమనిర్మాణంపై చర్యలు తీసుకోవాలని జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బచ్చుకుంట చెరువులో లాక్‌డౌన్ సమయంలో ఆదరబాదరాగా రెండు ఫ్లోర్‌లు స్లాబులు వేసి, మూడో ఫ్లోర్‌కు సిద్ధం చేశారని శేరిలింగంపల్లి తహసిల్ధార్ వంశీమోహన్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదు మేరకు జేసీబీ తీసుకుని కూల్చివేతలకు వెళ్లిన సిబ్బంది చర్యలు తీసుకోకుండా వెనక్కి రావడంలో ఆంతర్యమేంటని, దానికి తోడు తిరిగి ఫిర్యాదు రాకుండా చూసుకోండని నిర్మాణదారులకు సలహా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గతంలో కూల్చివేసిన చోట అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో ఇలా చెరువులను కబ్జా చేస్తే, తహసీల్దార్ కార్యాలయం మౌనం వహిస్తూ పౌతే ఎలా అని లేఖలో పేర్కొన్నారు. ఈ కబ్జాపై జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. వెంటనే బచ్చుకుంట చెరువును కబ్జా చేస్తూ నిర్మిస్తున్న ఈ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అక్రమ నిర్మాణాన్ని ఉపేక్షించేది లేదు: తహసీల్దార్ వంశీమోహన్
జనంకోసం ఫిర్యాదుపై శేరిలింగంపల్ల తహసీల్దార్ వంశీమోహన్‌ను నమస్తే శేరిలింగంపల్లి వివరణ కోరగా బచ్చుకుంటలో అక్రమ నిర్మాణంపై ఫిర్యదులు అందాయని, తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అక్కడి పరిస్థితుల దృష్టా జేసీబీతో కింది నుంచి నిర్మాణాన్ని కూల్చే పరిస్థితి అక్కడ లేనందునే సిబ్బంది వెనుదిరిగారని, శుక్రవారం నుంచి కంప్రెషర్ సహాయంతో పైనుంచి కూల్చివేయడం జరుగుతుందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో బచ్చుకుంటలో అక్రమ నిర్మాణాన్ని ఉపక్షేంచబోమని తెలిపారు.