శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి రంగనాథ్ స్వామి దేవాలయం వద్ద ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ హాజరై అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక మండపంలో శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ అయ్యప్ప స్వామి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అయ్యప్ప భజనలతో ప్రాంగణం స్వామి నామస్మరణతో మారుమోగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన తప్పక కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అయ్యప్ప స్వాములు, మహిళలు, పిల్లలు, గోపనపల్లి గ్రామస్థులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.