శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలోని అన్నమాచార్య భావన వాహినిలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం యథావిధిగా పారాయణ కార్యక్రమంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం రమాదేవి కోమ్మరవోళ్ళు, లలితా తిమ్మరాజు కలిసి స్వామి వారికి భక్తిపూర్వక వీణల విందు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కడిగిన పాదము, అదిగో అల్లదిగో శ్రీ హరి వాసము, శిరుత నువ్వుల వాడు, ఆదిమూలమే మాకు అంగరక్ష, తిరుమల గిరి రాయా, చూడమ్మ సతులాల అనే అన్నమయ్య సంకీర్తనలకు వీణార్చన చేసి స్వామివారికి కైంకర్యాన్ని సమర్పించారు. వీరికి మృదంగ వాయిద్యం మల్లికార్జున సహకారం అందించారు.

అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ సంయుక్తంగా కళాకారులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి ప్రశంసించారు. కార్యక్రమం చివరగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో విజయవంతంగా ముగిసింది.





