శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని విశ్వనాధ గార్డెన్‌లో శుక్రవారం అరైవ్ అలైవ్ (Arrive Alive) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి ఏసీపీ, మియాపూర్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పోలీసు శాఖకు చెందిన అధికారులు హాజరయ్యారు. ట్రాఫిక్ పోలీసు విభాగం, ఆర్‌టీఏ, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, వైద్య శాఖ, బీమా సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆటో, లారీ డ్రైవర్లు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, స్థానిక యువజన సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సుమారు 300 నుంచి 350 మంది వరకు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన వారందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం వంటి అంశాలపై అధికారులు సూచనలు చేశారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో కార్యక్రమం సఫలంగా ముగిసిందని మియాపూర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.






