శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ లోని మసీదుబండ రోడ్డు అండర్ పాస్ వద్ద స్థానిక కాలనీవాసులందరు ప్రతిరోజు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంటసేపు ట్రాఫిక్ లో చిక్కుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య సత్వర పరిష్కారానికి పూనుకొని దాదాపు 15 కాలనీల అసోసియేషన్ సభ్యులు ఒక JAC లాగా ఏర్పడి శేరిలింగంపల్లి MLA , పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఒక ఫ్లైఓవర్ కానీ లేదా మరొక అండర్ పాస్ కానీ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా అసోసియేషన్ సభ్యులు కోరారు. దానికి MLA గాంధీ సానుకూలంగా స్పందించి, అది రైల్వే డిపార్ట్మెంట్ (SCR) కు సంబంధించిన అంశం అయినందున ఈ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుంది, కావున ప్రత్యామ్నాయంగా ఏ విధమైన చర్యలు తీసుకోగలమో అనేది రెండు రోజుల్లో తానే అక్కడికి స్వయంగా వచ్చి, సంబంధిత అధికారులను అక్కడికి పిలిపించి, సమస్య పరిష్కారానికి తాత్కాలిక పరిష్కార మార్గాలు ఏవైనా ఉంటే వెంటనే అమలు చేసే విధంగా, శాశ్వత పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయకనగర్ కాలనీ ప్రెసిడెంట్ కనికిరెడ్డి, శారదానగర్ ప్రెసిడెంట్ త్రినాథ్, సెక్రటరీ రంగారావు, ప్రకాష్ నగర్ నుండి వెంకటరెడ్డి, వైశాలినగర్ నుండి శాస్త్రి, శ్రీకాంత్, హాలీవుడ్ కాలనీ, పాపిరెడ్డి కాలనీ, శిల్పా ఎంక్లేవ్, ఉషోదయ ఎంక్లేవ్ కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.






