శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి):శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ ప్రధాన రహదారిపై 450 మి.మీ. వ్యాసం కలిగిన RCC UGD పైప్లైన్ దెబ్బతినడంతో చేపట్టిన మరమ్మత్తు, పునరుద్ధరణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అర్థరాత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ తోపాటు జలమండలి అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ UGD పైప్లైన్ పగిలిపోవడంతో సమస్య తలెత్తిందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరమ్మత్తు పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అర్థరాత్రి వరకు పనుల వద్దే ఉండి పరిస్థితిని పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

మరమ్మత్తు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా అవసరమైన మళ్లింపు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, కొడిచెర్ల రాములు, మల్లేష్, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





