శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరం పరిసర ప్రాంతాల పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఈ తరహా వైద్య శిబిరాలు ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిల్లల వైద్యం, ఆర్థోపెడిక్, చర్మవ్యాధులు, నేత్ర, దంత, న్యూరాలజీ, ENT తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు కూడా పంపిణీ చేశారు.

వైద్య సేవలు అందించిన డాక్టర్లను గాంధీ శాలువాలతో సన్మానించారు. శిబిరంలో భాగంగా 18 రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు, ECG, గైనకాలజీ, ఆర్థో, ENT, దంత, కంటి పరీక్షలు, ఎక్స్‌రే సేవలు అందించడంతోపాటు అర్హులైన వారికి ఉచిత కళ్లజోళ్లు, ఉచిత మందులు పంపిణీ చేయడం చేశారు. ఆరోగ్యం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో సామాజిక బాధ్యతతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని గాంధీ పేర్కొన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆయన అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





