- యాన్యువల్ మొబిలైజేషన్ పరేడ్ – 2021 కార్యక్రమం ప్రారంభం
- 1635 మంది సాయుధ దళాల సమీకరణ
- ఫిబ్రవరి 1న డీ- మొబిలైజేషన్ పరేడ్
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం సైబరాబాద్ ఆర్మ్ డ్ రిజర్వ్(సాయుధ పోలీస్ దళాలు) యాన్యువల్ మొబిలైజేషన్ – 2021 పరేడ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ సాయుధ దళాల గౌరవ వందనాన్నిస్వీకరించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ సైబరాబాద్ లో 2వ సారి మొబిలైజేషన్ పరేడ్ జరపడం సంతోషమన్నారు. ఏఆర్ సిబ్బంది పనితీరు శ్లాఘనీయమన్నారు.
ఏఆర్ సిబ్బంది ఒక్క ఏఆర్ డ్యూటీనే కాకుండా ఎస్ఓటీ, షీ టీమ్స్, ఐటి సెల్, స్పెషల్ బ్రాంచ్/ఎస్బీ, సైబర్ క్రైమ్స్, ప్రిజనర్ ఎస్కార్ట్స్, క్యాష్ ఎస్కార్ట్స్, గార్డ్ డ్యూటీస్, ఎంటీ డ్రైవర్స్, స్పెషల్ పార్టీ, పీఎస్ఓ డ్యూటీ, బీడీ టీం, డాగ్ స్క్వాడ్ డ్యూటీస్, పైలట్ అండ్ ఎస్కార్ట్, ట్రాఫిక్ వింగ్, కమ్యూనికేషన్స్, ఎస్పీసీ, కళాబృందం, సిసిఆర్బి, క్లూస్ టీమ్స్ తదితర విభాగాల్లో పనిచేస్తారన్నారు. డ్రైవర్ విధులు వంటి పలు విభాగాల్లో పని చేస్తున్నారన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తూ ఆ రంగాలకు మంచి పేరు తెస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమానంగా పని చేస్తున్నారన్నారు. గణేశ్ బందోబస్త్, పండుగల సమయంలో, నూతన సంవత్సర వేడుకల రోజు, అసెంబ్లీ ఎలక్షన్స్, పంచాయత్ ఎలక్షన్స్, వరదలు, ముఖ్యంగా కోవిడ్ – 19 కరోనా సమయాల్లో ఏఆర్ సిబ్బంది బాగా పని చేశారన్నారు.
ఏఆర్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు, వారిని కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సమాయత్తం చేసేందుకు యాన్యువల్ మొబిలైజేషన్ పరేడ్ దోహదపడుతుందన్నారు. యాన్యువల్ మొబిలైజేషన్ పరేడ్ లో భాగంగా ఏఆర్ సిబ్బందికి వారు రోజువారీ నిర్వహించే విధుల పట్ల, ఇతర అంశాలపై ట్రైనింగ్ ఇస్తామన్నారు. సోమవారం ప్రారంభమైన యాన్యువల్ మొబిలైజేషన్ పరేడ్ 15 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఏఆర్ సిబ్బంది క్రమశిక్షణతో ట్రైనింగ్ లో పాల్గొని కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు.
కోవిడ్ సమయంలో ఏఆర్ సిబ్బంది బాగా పని చేశారు. అనేక మారుమూల ప్రాంతాల వారికి ఆహారం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారన్నారు. అలాగే లాక్ డౌన్ సమయంలో బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ఏప్రిల్ 12న బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభించి తలసేమియా, క్యాన్సర్ రోగులు, కిడ్నీ డయాలసిస్, గర్భిణీల కోసం మూడు విడతల్లో 7000 యూనిట్ల రక్తం సేకరించి ఇచ్చామన్నారు. కరోనా సమయంలో కోవిడ్ నుంచి కోలుకున్న 5000 మంది నుంచి అవసరమున్న 7000 మందికి ప్లాస్మా దానం చేశామన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. ఏఆర్ సిబ్బంది ఫిట్నెస్ ను కాపాడుకోవాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలన్నారు. వీలున్నప్పుడు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలన్నారు.
ఏఆర్ సిబ్బందిని మొబిలైజ్/ సమీకరించిన ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్ ను అభినందించారు. అనంతరం ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ డిసిపి ఎస్ఎమ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏఆర్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో సమానంగా పని చేస్తూ పోలీసులకు వెన్నెముకలా ఉన్నారన్నారు. 50 శాతం మంది ఏఆర్ సిబ్బంది సహకారంతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు చేస్తున్నామన్నారు. గతంతో పోలిస్తే ఇటీవల 200 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. అలాగే ఓఆర్ఆర్, హైవే పెట్రోలింగ్, కమాండ్ కంట్రోల్ రూమ్, రోడ్డు భద్రత, వర్షాకాలంలో, మరణాలను తగ్గించడంలో ట్రాఫిక్ సిబ్బందితోపాటు ఏఆర్ సిబ్బంది సహకారం ఉందన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. విధుల్లో నైపుణ్యం సాధించేందుకు ప్రతీ ఏటా నిర్వహించే మొబిలైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిజాయితీతో ప్రజలకు సేవలందించినట్టయితే పోలీసు శాఖకు మంచిగుర్తింపు వస్తుందన్నారు. ఏఆర్, సివిల్ పోలీసులు సమన్వయంతో పనిచేసినట్టయితే శాంతిభద్రతలను పరిరక్షించవచ్చని చెప్పారు.
అనంతరం ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య మాట్లాడుతూ.. సీపీ నేతృత్వంలో ఏఆర్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారన్నారు. విధులల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలన్నారు. ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అన్నారు. మనకు అన్నీ తెలుసు అనుకోకుండా పోలీసులు ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ అప్డేట్ అవ్వాలన్నారు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ కావలన్నారు. నేర్చుకున్న విషయాలను వృత్తిపరంగా ఉపయోగించుకోవాలన్నారు.
ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్ మాట్లాడుతూ సైబరాబాద్ ఆర్మ్ డ్ రిజర్వ్ యాన్యువల్ మొబిలైజేషన్ ఇచ్చిన శిక్షణలో లాఠీ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్, గార్డ్ మౌంటింగ్, మాబ్ ఆపరేషన్, పికెట్స్, బందోబస్త్ డ్యూటీస్, లా అండ్ ఆర్డర్ సమస్యలపైనా, ప్రకృతి విపత్తులు వంటి అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు.
సీఏఆర్ ఏసీపీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. శారీరక దారుఢ్యాన్ని పెంచు కోవాలని, ఆయుధాల వినియోగంపై అవగాహ న పెంచుకోవాలని సూచించారు. ఏఆర్ సిబ్బందితో ఏర్పాటు చేసిన పోలీస్ కళాబృందాలు వేల మంది విద్యార్థులు, ప్రజలకు వివిధ సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించారు. ముఖ్యంగా కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, బ్లడ్ డొనేషన్, ప్లాస్మా డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ పై, ఎన్నికల సమయంలో ఓటు విలువ, ‘ఓటు హక్కు పై ప్రజలకు, యువతకు ఆట, పాటలతో అవగాహన కల్పించారు. సక్సెస్ కు షార్ట్ కట్ లు లేవన్నారు. కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారన్నారు. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 15 రోజుల పాటు పోలీస్ సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, ఆర్ఐలు, 1635 ఏఆర్ సిబ్బంది, డాక్టర్ సుకుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.