శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలాలనే నేటికీ తెలంగాణ సమాజం అనుభవిస్తోందని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. భూమి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం మరో తెలంగాణ పోరాటం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ వారోత్సవాల ప్రారంభ సభను యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్‌లో నిర్వహించారు. మైదం శెట్టి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో తొలుత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులు దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మ, భీం రెడ్డి నరసింహారెడ్డి, మద్దికాయల ఓంకార్, మద్దికాయల లక్ష్మక్క చిత్రపటాలకు గాదగోని రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్మారకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కేవలం భూమి, భుక్తి, విముక్తి కోసం మాత్రమే కాకుండా లెవీ, గల్లా విధానాలకు వ్యతిరేకంగా, మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా, హక్కు పత్రాల కోసం, ఆత్మగౌరవ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం సాగిందన్నారు. ఈ పోరాటంలో సుమారు 4 వేల మంది అమరులయ్యారని, 3 వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని తెలిపారు. సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం ద్వారా ప్రజల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెరిగిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, వనం సుధాకర్, కుంభం సుకన్య, బి. బాబు, ఎం. అరుణ్‌కుమార్, కన్నం వెంకన్న, మంద రవి, వి. తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుడుం అనిల్‌కుమార్, కుసుంబ బాపురావు, వంగాల రాగసుధ, కనకం సంధ్య, తాండ్ర కళావతి, సింగతి మల్లికార్జున్, కర్ర దానయ్య, గాదె మల్లేష్, మాలోతు జబ్బర్ నాయక్, కర్రోళ్ల శ్రీనివాస్, జనగాం జిల్లా కన్వీనర్ కన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





