స్వర సిద్ధి గోవిందునికి అన్నమయ్య స్వరాలాపన – కూచిపూడి నృత్య నైవేద్యం

శేరిలింగంపల్లి, మార్చి 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ జరిగింది. అనంతరం సాయంత్రం యథావిధిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, అన్నమ గాయత్రి (గురు స్తుతి)తో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది. తదుపరి కూచిపూడి నృత్యార్చనలో భాగంగా అవరు రాజీ, శిష్యులు సంయుక్తంగా మూషిక వాహన, శ్రీ రాఘవం, తంబూరి మీటెడవా, తరంగం, చూడరందమ్మ, వినాయక కౌత్వం అనే నృత్యాంశాలను భావాభినయంతో ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.

అనంతరం గురువు ఓలేటి సృజన స్వామి వారికి మధుర స్వరాలతో అన్నమయ్య స్వరార్చన సమర్పించారు. ఈ సందర్భంగా ఎక్కడి మానుష జన్మం, ఆరగించి కూర్చున్నాడల్ల వాడే, అమ్మమ్మ రావమ్మ, పేరంటాండ్లు పాడరే, విన్నపాలు, ఆదిమూలమే మాకు, తెలిసితే మోక్షము అనే అన్నమయ్య సంకీర్తనలను శ్రుతి–లయ సమన్వయంతో ఆలపించి విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ స్వరార్చనకు కీబోర్డు పై ఒగిరాల గురుప్రసాద్, తబలపై ఒగిరాల సైనా నారాయణ వాయిద్య సహకారం అందించి గానానికి మరింత మాధుర్యం చేకూర్చారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ ఇచ్చి, గాన–నృత్య ప్రదర్శనలను అభినందించారు. గురువులు, శిష్యులను సాహిత్య భావం, లయ, అభినయ సమన్వయంతో తీర్చిదిద్దుతున్న విధానం ప్రశంసనీయం అని తెలిపారు.

తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ పాల్గొన్న కళాకారులందరికీ శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలను అందించి సత్కరించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో ఈ శనివారం అన్నమయ్యపురంలో జరిగిన అన్నదానం – పారాయణం – నృత్యార్చన – స్వరార్చన కార్యక్రమం భక్తి, సంగీత, నృత్య మాధుర్యంతో విజయవంతంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here