శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమం ఈ శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అనంతరం సాయంత్రం జరిగిన స్వరార్చనలో శిష్యులు తమ మధుర స్వరాలతో స్వామివారిని కీర్తిస్తూ భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తారు. తొలుత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీ బృందావన గురుకులం గురువు అన్నమయ్య పవన్ (అలనాటి అన్నమయ్యపురం విద్యార్థి), ఆయన శిష్యులు అశేష హితైషిణి, హరి చందన్, శన్విక, మౌక్తిక, లేహన, లోహిత్, రూప ప్రియ, శ్రీవిద్య, హర్షిత, కుసుమ, రజిత, ఝాన్సీ, సరిత, లత, సునీత, ప్రియాంక, పావని, ప్రత్యూష, రాజేశ్వరి, శోభారాణి, భవాని, పద్మ, ఇంద్రాణి, పద్మశ్రీ, ఉమా రెడ్డి, మౌనిక, పద్మజ నిర్మల తదితరులు సమిష్టిగా శ్రీమత్వదీయ చరితామృత (అన్నమయ్య స్తుతి) తో ప్రారంభించి, సకల బలంబులు నీవే, చక్కని తల్లికి, వెట్టివలపు, ఎక్కువ కులాజుడైన, వేడుకొందామా, మహినుద్యోగి, ఇట్టిముద్దులాడి, తిరుమల గిరి, గురుతెరిగిన, తెలిసితే మోక్షము, వేదంబెవ్వని వంటి బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమయ్య సంకీర్తనలను భక్తిరంజకంగా, భావపూర్వకంగా ఆలపించి విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. శిష్యుల గానం సాహిత్య భావం, శ్రుతి–లయ సమన్వయంతో సాగి స్వామివారి దివ్య కైంకర్యంగా నిలిచింది. ఈ స్వరార్చనకు కీబోర్డు పై ఆర్. శ్రీనివాస్, తబలా పై ఆర్. అజయ్ బాబు వాయిద్య సహకారం అందించి కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చారు. అలరించిన కళాకారులకు అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ నిర్వాహకులు జ్ఞాపికను బహుకరించి ప్రశంసించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.






