శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): అసెంబ్లీ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సాంబశివరావు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బిజెపి రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ అన్నారు. కమ్యూనిస్టులు వాళ్లు ఏమి మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదన్నారు. కగార్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ముందుకొస్తున్నారని, వారికి అసలు సిగ్గు లేదని ధ్వజమెత్తారు.

నక్సలైట్ల పేరుతో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఈ నాయకులకు ఎందుకు సిగ్గు రాదు అని తాను అడుగుతున్నానని, ప్రపంచ దేశాలు మన ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయని, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏం చేద్దాం అని అనుకుంటున్నాయో చెప్పాలని తాను అడుగుతున్నానని అన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రోజు రోజుకీ కమ్యూనిస్టు పార్టీ కనుమరుగైపోతుంటే వారు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు.





