- లక్ష్మీ నర్సింహా రెడ్డితో పాటు మరో మహిళను రిమాండ్ చేసిన రాయదుర్గం పోలీసులు
నమస్తే శేరిలింగంపల్లి: ప్రముఖ యాంకర్ శ్యామల భర్త, నటుడు లక్ష్మీ నర్సింహా రెడ్డిపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖాజాగూడ గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే సింధుర రెడ్డికి గండిపేట నాలుగు ఎకరాల స్థలం ఉంది. ఐతే సదరు స్థలంలో స్విమ్మింగ్‌పూల్, పబ్, గేమ్స్ జోన్స్ లాంటివి నిర్మించేందుకు రూ.1 కోటి చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే సింధుర రెడ్డి లక్ష్మీ నర్సింహారెడ్డికి రూ.85 లక్షలు చెల్లించింది. ఐతే నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అగ్రిమెంట్ ప్రకారం తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటు లక్ష్మీనర్సింహారెడ్డిపై ఒత్తిడి తెచ్చింది. కాగా మట్టా జయంతి అనే ఓ మహిళ లక్ష్మీ నర్సింహారెడ్డితో కలసి సింధూర రెడ్డిని భయబ్రాంతులకు గురిచేశారు. ఆమెతో సన్నిహితంగా దిగిన ఫోటోలను వైరల్ చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్ చేశారు. దీంతో సింధూర రెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 19న లక్ష్మీనర్సింహారెడ్డి, మట్టా జయంతి గౌడ్‌లపై ఐపీసీ సెక్షన్లు 420, 354-D, 504, 506, 384 r/w 34 కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం వారిరువురిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
