ఎల్ల‌ప్పుడూ ప్ర‌జా సేవ‌కే అంకితం: పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా త‌న‌కు వరుసగా 15 సంవత్సరాలు, హ‌ఫీజ్‌పేట‌ డివిజన్ కార్పొరేటర్ గా పూజిత గౌడ్ కి 10 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే అమూల్యమైన అవకాశం ఇచ్చిన ఓటర్లకు, హ‌ఫీజ్‌పేట్, మాదాపూర్ డివిజన్ల‌ ప్రజలకు జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త‌మ‌పై నమ్మకం ఉంచి, ఎల్లప్పుడూ అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఉన్నత నాయకత్వానికి, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నామ‌ని అన్నారు. గ‌డిచిన 15 సంవత్సరాల కాలంలో ప్ర‌జ‌లందరి విశ్వాసం, సహకారంతో ప్రజాసేవలో ముందుకు సాగుతూ, డివిజన్ల‌ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టగలిగామ‌ని తెలిపారు.

రహదారుల అభివృద్ధి, కాలువల నిర్మాణం,తాగునీటి సౌకర్యాల మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య కార్యక్రమాలు, పార్కుల అభివృద్ధి వంటి అనేక పనుల‌ను విజయవంతంగా పూర్తిచేశామ‌ని, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడ‌మే త‌మ‌ ధ్యేయంగా భావించామని అన్నారు. ఇకపై కూడా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హోదాలో నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అదే నిబద్ధతతో పని చేస్తామని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు వారధిగా ఉంటూ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా దోహద పడతామ‌న్నారు.

ప్రతి ఇంటి సమస్యను త‌మ‌ కుటుంబ సమస్యగా భావిస్తూ పని చేయడం త‌మ‌ బాధ్యతగా తీసుకుంటామ‌ని, కష్టకాలాల్లో ప్ర‌జ‌లందరి తోడ్పాటు త‌మ‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంద‌ని అన్నారు. ఇకముందు కూడా యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సాధికారత, వృద్ధుల సంక్షేమం, పాఠశాలలు, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై మరింత దృష్టి సారిస్తామ‌ని, పారదర్శకత, నిబద్ధత, ప్రజల పట్ల అంకితభావం అనే మూడు సూత్రాలతో ప్రజాసేవను కొనసాగిస్తామని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదాలు, మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నామ‌ని అన్నారు. ప్రజల సేవకే త‌మ జీవితం అంకితం అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here