శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్, నాగోల్ మెట్రో రైల్ స్టేషన్ లలో పెయిడ్ పార్కింగ్ అమలు విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎఫ్డీవై డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బేగం పేట లోని మెట్రో రైల్ భవన్ లో హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డికి ప్రతినిధి బృందం వినతిపత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్డీవై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి మధుసూదన్ మాట్లాడుతూ.. అక్టోబర్ 6 నుండి మియాపూర్ – నాగోల్ మెట్రో రైల్ స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని తీసుకురావాలని ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రో రైల్ విభాగాలు చేసిన నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వివిధ రూపాలలో ప్రయాణికులకు అందిస్తున్న స్కీములను పొడిగిస్తున్నామని చెబుతూనే మరోపక్క మెట్రో ఛార్జీలను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మెట్రో రవాణా చార్జీల భారాన్ని, వాహనాల పార్కింగ్ చార్జీల భారం వలన వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పార్కింగ్ స్థలాలలో వాహనాలకు భద్రత లేకపోవడం, సరైన సౌకర్యాలు కల్పించకపోవడం లాంటివి ఎదురవుతున్న తరుణంలో ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడానికి ఎల్ అండ్ టీ హైదరాబాదు, మెట్రో రైల్ సంస్థలు చేస్తున్న ప్రణాళికను విరమించుకోవాలని ఏఐఎఫ్ డీవై గ్రేట్ హైదరాబాద్ కమిటీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు ఇ.దశరథ్ నాయక్, డి.శ్రీనివాసులు, తేజ తదితరులు పాల్గొన్నారు.