శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్‌లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ యువనేత రాగిరి సాయిరాం గౌడ్ సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నమస్తే శేరిలింగంపల్లి’ ఆన్‌లైన్ పత్రికలో ‘అనుమతులు దండగ… అధికారులకు పండగ… పర్మీషన్లతో పొంతన లేని భవన నిర్మాణాలు…’ పేరిట ప్రచురితం అయిన కథనానికి స్పందించి తాము ఈ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆడింది ఆటగా పాడింది పాటగా మారిందన్నారు. అక్రమార్కులు ఇస్తున్న తాయిలాలకు ఆశపడి అక్రమ నిర్మాణాలను అధికారులే దగ్గరుండి స్వయంగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఒక స్థలానికి లెక్కకు మించి అనుమతులు తీసుకుంటున్నారని, కానీ ఒకే భవనాన్ని నిర్మిస్తున్నారని, అలాగే స్టిల్ట్ ప్లస్ 2 పేరిట పర్మిషన్లను పొంది 7, 8 అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నారని ధ్వజమెత్తారు. మార్టిగేజ్, భారీ ఫీజుల ఎగవేతతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని అన్నారు. వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు.





