శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల ఉప కమిషనర్‌లకు మదర్ సేవా సమితి ట్రస్టు చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని పాపిరెడ్డి నగర్, రాజీవ్ గృహ కల్ప, డోయెన్స్ కాలనీ, సుదర్శన్ నగర్, క్రాంతివనం, శిల్పాఎన్‌క్లేవ్, కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, రాజరాజేశ్వరి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, మార్తాండ నగర్, ప్రేమ్ నగర్, అంజయ్య నగర్, సిద్దిక్ నగర్, మాదాపూర్‌లతోపాటు చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్, హుడా కాలనీ, మదీనాగూడ, మియాపూర్, మాతృశ్రీనగర్, హఫీజ్‌పేట, ఆదిత్య నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, భిక్షపతి నగర్, గోకుల్ ప్లాట్స్, అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్, ఖానామెట్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని అన్నారు.

100, 200, 300 గజాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా 5 నుంచి 9 అంతస్తుల మేర భవన నిర్మాణాలను చేపడుతున్నారని, ఆ నిర్మాణాలకు సెట్ బ్యాక్ కూడా వదలడం లేదని అన్నారు. అక్రమ నిర్మాణాలను చేపట్టి లక్షల రూపాయలకు అద్దెకు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్లు, ఆంబులెన్స్‌లు వచ్చేందుకు కూడా తావు లేకుండా అత్యంత ఇరుకుగా నిర్మాణాలను చేపడుతున్నారని అన్నారు. ఈ నిర్మాణాలపై గతంలోనే తాము సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అక్రమ నిర్మాణదారుల వద్ద లంచాలు తీసుకుని వదిలేస్తున్నారని, దీంతో నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులతోపాటు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బద్దం కొండల్ రెడ్డి కోరారు.





