శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని మక్తా మహబూబ్ పేట సర్వే నంబర్ 44లో సాయి నగర్ కాలనీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చందానగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 44 లో సీజ్ చేయబడిన భవనాలపై రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ సీల్‌ను తీసేసి భవనాలను నిర్మిస్తున్నారని, గృహ ప్రవేశానికి కూడా సిద్ధమవుతున్నారని అన్నారు. అయినప్పటికీ స్థానిక జిహెచ్ఎంసి అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. జిహెచ్ఎంసి అధికారులకు తాము డబ్బును ఇచ్చామని బిల్డర్లు యథేచ్ఛగా చెబుతున్నారని అన్నారు. కనుక బిల్డర్లతోపాటు అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.





