మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్ లో ఉన్న డ్రీమ్స్ ఫర్ గుడ్ సొసైటీలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సరోజిని నాయుడు జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ, మహిళలు మాధవీలత, నిర్మల వాసపల్లిలు సరోజిని నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత – సరోజిని నాయుడి పాత్ర అనే విషయంపై వక్తలు ప్రసంగించారు. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి మహిళా నాయకురాళ్లు మహిళా సాధికారతకు కృషిచేయాలన్నారు. సరోజిని నాయుడు రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక , సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలచుకొన్న వారికి మార్గాలు అనేకం అని నిరూపించిన మహిళ అని, భావి తరాలు గుర్తుంచుకోవాలని కొనియాడారు. ఆమె ఈ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమె గౌరవార్థం ఆమె జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకొంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాలు చావా అరుణ , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, శివరామకృష్ణ, పాకాలపాటి శ్రీను, వరలక్ష్మి పాల్గొన్నారు.
