శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): పాపిరెడ్డి కాలనీ, సందయ్య నగర్, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, సురభి కాలనీ తదితర ప్రాంతాలలో సుమారు 40 వేల పైచిలుకు జనాభా నివసిస్తున్నారని, మద్యపానం, గంజాయి, మాదక దవ్యాల వినియోగం ఎక్కువగా జరుగుతుందని శేరిలింగంపల్లి మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. రాత్రి వేళల్లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతూ ఉండడమే కాకుండా యువత చెడుదారులు పడుతుందని వాపోయారు. సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందని, ఈ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాలవారు నివసిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని సక్రమ, సత్వర, సానుకూల చర్యలు చేపట్టి పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సైబరాబాద్‌పోలీసు కమిషనర్ అవినాష్ మహంతికి తాడిబోయిన రామస్వామి యాదవ్ వినతిపత్రం అందజేశారు.






