శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజఫర్ అహమ్మద్ నగర్ లో ప్రజా సంఘాలు, ఎఐఎఫ్ డివై, ఎఐఎఫ్డి డబ్ల్యు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి ఏఐఎఫ్డీ డబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అంగడి పుష్ప, ఏఐఎఫ్డి వై గ్రేటర్ హైదరాబాద్ నాయకుడు ఇస్లావత్ దశరథ్ నాయక్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల వారికి చదువు చెప్పడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు ఏర్పడినా, ఆడపిల్లలు చదువుకోవాలనే దృక్పథంతో చదువుకుంటూనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో వెనుకబడిన వర్గాలకు చదువు నేర్పిందన్నారు.
నేటి సమాజంలో సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుకు సాగాలని బహుజన వర్గాలు అన్ని రంగాలలో ముందు ఉండాలని తెలియజేశారు. నేటి మనువాద పాలనలో సమానత్వం లేని చదువులు ఎదుర్కొంటున్నామని చదువులో వివక్ష ఎదుర్కొంటున్నామని అన్నారు. విద్యతోనే విజ్ఞానం కలుగుతుందని సావిత్రిబాయి పూలే నిరూపించారని, వారి అడుగుజాడల్లో మనువాద, బ్రాహ్మణిజాన్ని ఎదుర్కొనేందుకు సావిత్రిబాయి పూలే ఆదర్శాలతో అందరూ ముందుకు సాగాలని తెలియజేశారు. జి శివాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వి అనిత, ఎండి సుల్తానా బేగం, బి శంకర్, ఈశ్వరమ్మ, డి లక్ష్మి, కె.ఇందిరా, కె. నిర్మల తదితరులు పాల్గొన్నారు.