సైబరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ప్రతిరోజూ ఒక వార్డు కార్య‌క్ర‌మం ప్రారంభం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజ‌న ప్రతిరోజూ ఒక వార్డు (One Ward Every Day) నూతన కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి జోన్ లోని అమీన్‌పూర్ సర్కిల్ RC పురం వార్డులో క్షేత్రస్థాయి తనిఖీతో సోమ‌వారం ప్రారంభించారు. అమీన్‌పూర్ డిప్యూటీ కమిషనర్‌తో కలిసి వార్డులోని పౌర సమస్యలు, కొనసాగుతున్న పనులను సమీక్షించారు. పాలనను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమ‌ని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఒక వార్డును సందర్శించి, మౌలిక సదుపాయాలను పరిశీలించడంతోపాటు సమస్యలను గుర్తించి వాటిని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 3 జోన్లు, 76 వార్డులలో ఈ కార్యక్రమం కొనసాగుతుంద‌ని, వీధి దీపాలు, డ్రైనేజీ (నాలాలు), పారిశుధ్య లోపాలు ఉన్న ప్రాంతాలు, ఇతర పౌర సేవలపై ప్రధానంగా దృష్టి సారిస్తార‌ని తెలిపారు.

సోమ‌వారం నాటి సందర్శనలో భాగంగా కమిషనర్ క్షేత్రస్థాయిలో నిశితంగా తనిఖీలు చేపట్టారు. స్థానిక నివాసితులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) ప్రతినిధులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాకతీయ నగర్ పార్క్ లో వీధి దీపాల కోసం ప్ర‌త్యేక‌ మీటర్ ఏర్పాటు చేయాలని, నిర్వహణ మెరుగుపరచాలని RWA సభ్యులు కోరారు. దీనిపై విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. క‌మ్యూనిటీ హాల్‌ మొదటి అంతస్తు నిర్మాణానికి వచ్చిన విన్నపాన్ని పరిశీలించి, అంచనాలు (Estimates) సిద్ధం చేసి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సర్కిల్ కార్యాలయాన్ని RC పురంలోని MPDO భవనానికి మార్చే ప్రతిపాదనను సమీక్షించారు. ఇందుకు సంబంధించి లొకేషన్ స్కెచ్ మ్యాప్ సిద్ధం చేయాలని కమిషనర్ సూచించారు.

రాయసముద్రం చెరువు అభివృద్ధి పనులను సమీక్షించారు. HMDA ద్వారా రూ.15 కోట్లు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. చెరువులో గుర్రపు డెక్కను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి BHEL అధికారులతో సమన్వయం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌కు సూచించారు. పారిశుధ్యం, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియను సమీక్షించారు. చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను (GVPs) గుర్తించి, అక్కడ నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యం అత్యవసరమని కమిషనర్ పేర్కొన్నారు. వార్డు సందర్శనల సమయంలో RWA సభ్యులు, స్థానికులు పాల్గొని తమ ఫీడ్‌బ్యాక్, సమస్యలను తెలియజేయాలని కోరారు. తద్వారా సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.

అన్ని పనులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో మార్పు కనిపించేలా వేగంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పౌర సేవలను మెరుగుపరచడానికి, ప్రజలకు, పాలన యంత్రాంగానికి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ నిరంతర ప్రక్రియ కొనసాగుతుంద‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here