శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): బిసి కుల సంఘాలు, బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపులో భాగంగా మియాపూర్ ప్రధాన చౌరస్తాలో శేరిలింగంపల్లి జేఏసీ చైర్మన్, టిఆర్పి శేరిలింగంపల్లి అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇచ్చి తీరాలన్నారు. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేంత వరకు తాము పోరాటం చేస్తామన్నారు. ఇందుకు అవసరం అయితే సుప్రీం కోర్టు వరకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలను రాజకీయ పార్టీలు ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తూ వస్తున్నాయని మండి పడ్డారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బీసీలకు గత 70 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందన్నారు. పోరాడి తాము అధికారాన్ని సాధించుకుంటామని స్పష్టం చేశారు. తమకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిసి సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు శంకర్, కంకల్ బిసి అధ్యక్షుడు శ్రీనివాస్, విజయలక్ష్మి, బి కృష్ణ, మల్కయ్య, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






