పీజేఆర్ స్టేడియంలో 3ఏ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం

శేరిలింగంపల్లి, మే 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలోని పీజేఆర్ స్టేడియంలో కట్ల మల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3ఏ వాలీబాల్ టోర్నమెంట్ ను శ‌నివారం ప్రారంభించారు. రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ టోర్న‌మెంట్‌ను తెలంగాణ 3-ఏ-సైడ్ వాలీబాల్ అసోసియేషన్ సహకారంతో నిర్వ‌హిస్తున్నారు. ఈ పోటీలలో బాలురు, బాలికల ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రతిభావంతులైన క్రీడాకారులకు వేదిక కల్పించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని కట్ల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బాలురకు అండర్-14, అండర్-21 విభాగాలలో పోటీలు నిర్వహించబడగా, బాలికలకు ఓపెన్ కేటగిరీలో అవకాశం కల్పించారు.

ప్రతి జట్టులో నలుగురు ఆటగాళ్లు ఉండగా, ముగ్గురు మాత్రమే మైదానంలో ఆడే విధంగా నిబంధనలు రూపొందించారు. నాకౌట్ పద్ధతిలో బెస్ట్ ఆఫ్ త్రీ సెట్స్‌తో మ్యాచ్‌లు జరగనున్నాయి. విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతి రూ.10వేలు, రెండవ బహుమతి రూ.5వేలుగా నిర్ణయించారు. అండర్-14 బాలుర విభాగంలో ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here